CM Revanth: అదానీ ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తిరస్కరించారు?
అదానీ గ్రూప్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ విరాళంగా ఇచ్చిన రూ. 100 కోట్లను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ గ్రూప్‌పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు.
ప్రభుత్వంపై అసత్యాల ప్రచారం!
‘అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉంటుంది. అంబానీ, అదానీ, టాటా.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉంది. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ వర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు, ప్రభుత్వానికి ఇష్టంలేదు. అదానీ గ్రూప్ స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. సీఎస్‌ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్‌నకు లేఖ పంపాం. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు’ అని స్పష్టంచేశారు.