CM Revanth: ప్రజా పోరాటంతో.. వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి!
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తీసుకుంది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు కోసం ఆగస్ట్ 1న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లగచర్లలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌ను అక్కడి రైతులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యంగా మారతాయని లగచర్ల రైతులు, ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే లగచర్ల గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ రసాభాస అయ్యింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు పలువురు అధికారులపై గ్రామస్తులు దాడి చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కేసులో పలువురు గ్రామస్తుల్ని జైలుకు పంపారు. ఈ ఘటన వెనక బీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపించిన ప్రభుత్వం ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
నోటిఫికేషన్ వెనక్కి!
అరెస్టులతో రైతులు వెనక్కి తగ్గుతారని, ఈ వివాదం ఇంతటితో సర్దుమణుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ కేసులు, అరెస్టులకు రైతులు భయపడలేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా తమ పల్లెల్ని కాలుష్య కారకాలుగా మారిస్తే ఊరుకునేది లేదని తిరగబడ్డారు. దీనికి తోడు రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఈ ఘటన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అంతేకాదు అరెస్టైన రైతులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఏది ఏమైనా రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఈ అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కేవలం తన అల్లుడు, అన్నదమ్ముల కోసమే రేవంత్‌రెడ్డి బలవంతంగా ఆదివాసుల భూములు లాక్కుంటున్నారని ప్రజలకు వివరించారు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి కాకుండా సొంత పార్టీలోనూ ఈ భూసేకరణపై విమర్శలు వచ్చాయట. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ అంశాన్ని తెగ దాకా లాగొద్దని ప్రభుత్వానికి సలహా ఇచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు లగచర్ల భూసేకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు రాజకీయంగా లబ్ధి పొందకూడదనే వ్యూహంలో భాగంగానే భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.