అధికారంలోకి రాకముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అందరూ ‘ట్రబుల్ షూటర్’ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనే ‘ట్రబుల్స్’లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీఎంలందరూ ఒక దారిలో వెళ్తుంటే ఆయన మరో దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా పార్టీ అధిష్టానంతోనే సీఎం రేవంత్ పెట్టుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్‌కే ఆయన ఎదురెళ్తున్నారా? అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
‘అదానీ’పై ఇండియా కూటమిది ఒకే మాట!
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సీఎంలందరూ అధిష్టానం చెప్పిందే వింటారు. హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటారు. జాతీయ పార్టీ అధిష్టానం ఎవర్ని విమర్శిస్తుందో వారిని విమర్శించాలి. ఎవరిని వ్యతిరేకిస్తుందో, వారిని వ్యతిరేకించాలి. ఈ క్రమంలోనే ఇటు ఎన్డీయేపై, అటు ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంచుకున్న అస్త్రం ‘అదానీ’. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైందని, ఆయనతో వేల కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకొని ‘అదానీ గ్రూప్ సంస్థ’లకు లాభం చేకూరుస్తోందని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇదే విషయమై పార్లమెంటులోనూ పెద్ద రచ్చే జరిగింది. దీనికి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. కూటమికి కట్టుబడి తమిళనాడులోని డీఎంకే పార్టీ ఏకంగా అదానీ గ్రూపు సంస్థలతో కుదుర్చుకున్న వేలాది కోట్ల రూపాయల డీల్‌ని సైతం రద్దు చేసుకుంది.
రేవంత్‌ది మాత్రం సెపరేట్ రూటా?
అధిష్టానం తీరు అలా ఉంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది మాత్రం సెపరేట్ రూట్‌లా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆదానీని వ్యతిరేకిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి. ఆ మధ్య స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్ల రూపాయల విరాళం వెనక్కి ఇచ్చేసినా అదానీ గ్రూప్ సంస్థలతో కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను రేవంత్ ఇంకా రద్దు చేసుకోలేదని వార్తలు వినిపిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్, సిమెంట్, డాటా సెంటర్లు ఇతర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అదానీ సంస్థలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలేవీ ఇంకా రద్దు చేసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీఎంలందరూ అధిష్టానం చెప్పిన రూట్ ఫాలో అవుతుంటే.. సీఎం రేవంత్ మాత్రం సెపరేట్ రూట్ ఫాలో అవుతూ.. అధిష్టానానికే ఎదురెళ్తున్నారని.. ఈ విషయం ఢిల్లీ పెద్దల దాకా చేరితే రేవంత్ పరిస్థితి ఏంటోనని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట.