
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతున్న కొన్ని కంపెనీలు అసలు మనుగడలోనే లేవని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. సీఎం దావోస్ పర్యటనలో అంకెల గారడీ తప్ప పెట్టుబడుల లెక్కల్లో వాస్తవం లేదు అని తెలిపారు. తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ యూరోప్‌కు చెందినదనే దావోస్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారా..? అని ప్రశ్నించారు సన్ సంస్థ ఎండీ దావోస్‌లో లేకున్నా ఉన్నారని ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంవో తప్పుడు ప్రకటన ఇచ్చిందని దుయ్యబట్టారు. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వీ స్థానంలో వేరే వ్యక్తితో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో దిగారని ఆరోపించారు. అమెజాన్ సంస్థ పెట్టుబడులు కేసీఆర్ హయాంలో వస్తే ఇప్పుడు వచ్చాయని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటాలు మానేసి పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలేంటి?: కిషన్ రెడ్డి
మరోవైపు.. రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం మండిపడ్డారు. తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుదేలైందన్నారు. కొందరైతే రియల్ ఎస్టేట్ రంగాన్ని వదిలేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు.