Congress: తెలంగాణ తల్లా? కాంగ్రెస్ తల్లా? రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన తెలంగాణ తల్లి విగ్రహం పూర్తయింది. ఈ విగ్రహాన్ని ఇటీవలే విడుదల కూడా చేశారు. సచివాలయంలో ఈనెల తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైపోయింది కూడా. అయితే ప్రభుత్వం రూపొందించిన ఈ తెలంగాణ తల్లి విగ్రహం నమూనాపై ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ చెయ్యి గుర్తును ప్రచారం చేసే తల్లిలా, కాంగ్రెస్ ప్రచారాస్త్రం అభయహస్తంలా ఉండేలా రూపుమార్చారని భగ్గుమంటున్నారు. చెయ్యి గుర్తుకోసం పెట్టిన తల్లి ప్రతిమ అని, పాలనలో కాంగ్రెస్ ముద్ర కోసం కక్కుర్తి పడ్డట్టే అనిపిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తలపై కిరీటం, చేతిలో బతుకమ్మ ఏవీ?
ఇంతకు ముందున్న తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో నుంచి బతుకమ్మను తీసేయడం, కిరీటం లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడంపై ప్రతిఒక్కరూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ అస్తత్వానికి, మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేయడం అందరూ మండిపడుతున్నారు. కిరీటం దైవత్వానికి ప్రతీక, భక్తికి ప్రతీరూపంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. అనాదిగా దైవాలకు (దేవుళ్ల)కు కిరీటాలే ఉంటాయి. తల్లిని దైవంగా భావిస్తారు కాబట్టి గతంలో తెలంగాణ తల్లికి కూడా కిరీటాన్ని పెట్టారు. భారతమాత, తెలుగుమాత, అంతకుముందు ఆంధ్రామాత, కన్నడమాత, ఛత్తీస్‌గఢ్ మాత.. ఏ రాష్ట్రమాతకైనా కిరీటమే ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై కిరీటం లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే!
కిరీటం, చేతిలో బతుకమ్మ లేని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే తెలంగాణ అస్తిత్వ భావనను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర తెలియనివాళ్లు, అసలు ఆనాడు ఉద్యమంలో భాగం కానివాళ్లు మాత్రమే ఇంతటి దారుణానికి పూనుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? పార్టీకో తల్లి ఉంటుంది కానీ ప్రభుత్వానికో తల్లి ఉంటుందా? అని విమర్శలు గుప్పిస్తున్నారు.