
Congress: కొడంగల్ నుంచే రేవంత్ సర్కార్‌పై తిరుగుబాటు మొదలైంది.. కేటీఆర్!
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డితోపాటు.. బీఎస్పీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నర్మద బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు దాదాపు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కారెక్కారు.
రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. కాంగ్రెస్ నేతలది పెరుగుతోంది!
ఈ సందర్భంగా కేటీఆర్ రేవంత్ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కొడంగల్‌లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పక్కనపెట్టి, కేవలం కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తిట్టిపోసిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. పదేళ్లు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని, కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం పెరుగుతోందని ధ్వజమెత్తారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు మూటలు నింపుకునే పనిలో మునిగితేలుతున్నారని విమర్శించారు.