Congress: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్పుడే ఎందుకింత వ్యతిరేకత?
అధికారం చేపట్టి ఇంకా ఏడాది కూడా కాకుండానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఏకంగా జిల్లా కలెక్టరుపై, ప్రభుత్వ అధికారులపై ప్రజలు దాడులు చేసే పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? సమగ్ర కుటుంబ సర్వే కోసం వెళ్లిన అధికారులను బండబూతులు ఎందుకు తిడుతున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ఆరు గ్యారంటీలను సకాలంలో అమలు చేయకపోవడమే ఆ పార్టీ పాలిట శాపమైందా? హైదరాబాద్‌లో ‘హైడ్రా’ విషయంలో ప్రభుత్వం మీద కొనసాగుతున్న వ్యతిరేకత రాష్ట్రమంతటా తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెడుతోందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానమే చెబుతున్నారు.
హామీల అమలు ఏదీ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ఆరు గ్యారంటీలు’ అమలు ఆ పార్టీ నాయకులు ప్రగల్బాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. మహిళలకు ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్ తప్ప ఏ ఒక్క గ్యారంటీ కూడా సరిగా అమలు కావడం లేదు. రైతు రుణమాఫీ పూర్తైందని మంత్రులు చెబుతున్నా.. ఇప్పటికీ ఎంతో మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక, రైతుబంధు పథకం గురించైతే ఊసే లేదు. రైతుకు పెట్టుబడి సాయం పెంచడం మాట పక్కన పెడితే కనీసం వచ్చే సాయం కూడా అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుబీమా పథకానికి కూడా త్వరితగతిన నిధులు విడుదల చేయడం లేదు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పేరుకు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నా.. ప్రభుత్వం భర్తీ చేసింది మాత్రం కేవలం 11 వేల డీఎస్సీ పోస్టులు మాత్రమే. వీటన్నికి తోడు పేద, మధ్యతరగతి కలలను చెరిపేస్తూ మూసీ ప్రక్షాళన అంటూ హైదరాబాద్‌లో ‘హైడ్రా’ వ్యవస్థకు తెర లేపారు. ఈ పరిణామాలన్నిటితోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని, అందుకే ఎక్కడబడితే అక్కడ ప్రభుత్వంపై
ప్రజలు తిరగబడుతున్నారంటూ ప్రతిపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
సొంత పార్టీలోనే అసంతృప్తి?
ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శల దండయాత్ర చేస్తున్నా.. కూడా కాంగ్రెస్‌లో బడా నేతలు మాకెందుకులే మమ్మల్ని కాదు కదా అన్నట్లు సైలెంట్‌గా ఉంటున్నారు. అసలు ప్రభుత్వ పాలనపై సొంతపార్టీలోనే కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే కేటీఆర్, హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ వాళ్లని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.