Ganesh Chaturthi: రేపే వినాయక చవితి.. కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుడు!
దేశవ్యాప్తంగా రేపు వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సందడి మొదలైపోయింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడే టక్కున గుర్తుకొస్తాడు. ఎందుకంటే, ఇక్కడ కొలువయ్యే వినాయకునికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఖైరతాబాద్ వినాయకున్ని చూసేందుకు చాలామంది భక్తులు బారులు తీరుతారు. ఈ గణనాథుడికి ఒక్క తెలుగురాష్ట్ర్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది.
ఇక, ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల ఎత్తులో ఉండనున్నాడు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కావొస్తుండడంతో ఈ సారి ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇక, ఈఏడాది వినాయకుడు సప్తముఖ మహాగణపతిగా పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. ఖైరతాబాద్ సప్తముఖ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. సప్తముఖ మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ మొదటిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని జరిపించింది. ఈకార్యక్రమంలో స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.