
Hussain Sagar: బాణాసంచా పేల్చడంతోనే అగ్నిప్రమాదం!
హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణం బాణాసంచా పేలడమేనని పోలీసులు తెలిపారు. భారతమాత మహా హారతి ముగింపు కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్‌లోని బోట్ల వద్ద బాణాసంచాల పేల్చుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. రెండు పడవలు పూర్తిగా దగ్దం అయ్యాయి. ప్రమాద సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకడంతో ప్రాణాలు దక్కాయి. అయితే ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆదివారం రాత్రి ‘భారతమాత మహాహారతి’ వేడుక ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు చికిత్స తీసుకుంటున్నారు.
గల్లంతైన యువకుడు?
అయితే నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో నాగారం వాసి అజయ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గాలింపు చేపట్టి అతడి ఆచూకీ తెలపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అజయ్‌తోపాటు వెళ్లిన స్నేహితులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో గాలింపు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.