Hydra: ‘హైడ్రా’పై వెనక్కి తగ్గిన సీఎం.. కారణం అదేనా?
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘హైడ్రా’ ఎట్టకేలకు వెనక్కి తగ్గిందా? హైదరాబాద్‌లో ‘హైడ్రా’ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైందని, ఇక ఈ విషయంలో వెనక్కి తగ్గడమే మేలని, లేకపోతే మొదటికే ఎసరు వచ్చేలా పరిస్థితి మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ తాజాగా చేసిన కీలక వ్యాఖ్యలను గమనిస్తే ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది.
ఆ నిర్మాణాల జోలికి వెళ్లరట!
ఇవాళ మీడియాతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని అన్నారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమన్నారు. ‘గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పనిచేస్తున్నాం. పేదల జోలికి హైడ్రా రాదు. ’ అని రంగనాథ్ స్పష్టంచేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమేనా?
‘హైడ్రా’ చర్యలు ప్రారంభించిన మొదట్లో సోషల్ మీడియా నుంచి సానుకూల స్పందన వచ్చింది. కూల్చివేతల్ని స్వాగతిస్తూ ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తర్వాతి కాలంలో చోటుచేసుకున్న కూల్చివేతలతో సోషల్ మీడియా వైఖరి మారింది. పలువురు హైడ్రా తీరును ప్రశ్నిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. నిరసనలు, రాస్తారొకోలు జరిగాయి. బాధితుల ఆక్రందనలు, ఆవేదనలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు.. అంతకంతకూ ఎక్కువైంది. మొదట్లో వ్యతిరేకించినా.. మున్ముందు అంతా సర్దుకుంటుందని ప్రభుత్వం భావించింది. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో పలు చోట్ల నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ‘హైడ్రా’ దెబ్బతో నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలైంది. అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఇక.. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. పైగా ఇప్పుడు హైడ్రా వ్యతిరేకత తోడైంది. ఇప్పటినుంచే నగర ప్రజల్ని ఆకర్షిస్తే తప్ప బల్దియా ఎన్నికల్లో ఓట్లు పడవు. లేదంటే.. ఇలాగే ముందుకెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఒక్క సీటు వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ గ్రేటర్ పీఠాన్ని గనుక బీఆర్ఎస్ ఛేజిక్కించుకుంటే ఇక అంతే.. నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాస్త రూరల్ ప్రాంతాలకూ పాకుతంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.