తెలుగు
te తెలుగు en English
Linkin Bioతెలంగాణ

Hydra: పేదలకో న్యాయం.. పెద్దోళ్లకో న్యాయం.. దారి తప్పుతున్న ‘హైడ్రా’!?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎక్కడ కనిపించినా నేలమట్టం చేస్తున్న ‘హైడ్రా’.. క్రమంగా దారి తప్పుతోందా? పేదల స్థలాల విషయంలో ఒకలా.. పెద్దోళ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తుందా? పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొట్టడమే హైడ్రా పనిగా పెట్టుకుందా.. ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. పలుకుబడి ఉన్న వ్యక్తులకు నోటీసులతో సరిపెడుతున్న సర్కారు.. పేదోడి గూడుపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోందనే వాదన క్రమంగా బలపడుతోంది.

అనుమతులుంటే అక్రమ నిర్మాణమెలా అవుతుంది?

అవును నిజమే కదా మరి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, జయభేరి కన్‌స్ట్రక్షన్స్ అధినేత మురళీ మోహన్ వంటి వారికి.. నోటీసులుతో సరిపెట్టడమే కాకుండా.. వారు కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకునేంతా సమయం ఇచ్చిన హైడ్రా.. పేదల విషయంలో మాత్రం కర్కషంగా వ్యవహరిస్తోంది. రాత్రనక, పగలనక కష్టపడి ఎన్నో కలలతో నిర్మించుకున్న సొంతింటిని ‘అక్రమ’ నిర్మాణం పేరుతో హైడ్రా అధికారులు కూల్చివేస్తుంటే బాధితుల రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కలచివేస్తున్నా ప్రభుత్వానికి గానీ, హైడ్రా అధికారులకు గానీ అవేవీ పట్టడం లేదు. తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు, అన్ని అనుమతులు ఉన్నాయని బాధితులు గొంతు చించుకున్నా ఎవరూ పట్టంచుకోవడంలేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే తమ ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తే.. తన కష్టాన్నంతా ధారపోసి మూడేళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. ఇక, హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇల్లు కూల్చేయటంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని.. తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఆ చిన్నారి వాపోతున్న వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.

శని, ఆదివారాల్లోనే ఎందుకు?

హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో అందరికీ ఒకటే న్యాయమనే సూత్రం అమలైంది. అందుకే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. తమ ప్రాంతానికి రావాలని ఆహ్వానించారు. అంతెందుకు హైడ్రాను రాష్ట్రవ్యాప్తం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ వచ్చిన మంచిపేరుని హైడ్రా కొద్దిరోజులకే పోగొట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఉద్దేశం మంచిదైనా ఆచరణ లోపాలు హైడ్రాను వెక్కిరిస్తున్నాయి. చట్టబద్ధంగా కూల్చివేతలు జరుగుతున్న భావన కలిగించకుండా.. కోర్టు లేని రోజుల్లో అంటే శని, ఆదివారాల్లో హడావుడిగా నోటీసులు, కూల్చివేతలతో అసలు ఉద్దేశం నీరుగారే పరిస్థితి వచ్చింది. ఆక్రమణలు అని పక్కాగా రుజువులుంటే.. కోర్టులు లేనప్పుడు హడావుడి చేయాల్సిన పనేముందనే ప్రశ్నలకు అసలు అధికారుల వద్ద సమాధానమే లేదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button