Hydra: ‘హైడ్రా’నే కాంగ్రెస్ కొంప ముంచనుందా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి షాక్ తప్పదా?
సీఎం రేవంత్ రెడ్డి తన కంటిని తానే పొడుచుకున్నారా? చేజేతులరా తన పార్టీకి తానే నష్టం కలిగించుకున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు నిజమనే చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘హైడ్రా’.. చివరకు కాంగ్రెస్ పార్టీ పాలిటే శత్రువులా మారిందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘హైడ్రా’ కూల్చివేతలకు మొదట్లో కొంత మంచి పేరే వచ్చినా.. ప్రస్తుతం మాత్రం విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి.
బాధితులు ప్రశ్నలకు సమాధానం కరువు
‘హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో చాలా మంది పేద, మధ్యతరగతి వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. తమ దగ్గర అన్ని పత్రాలు, అన్ని పర్మిషన్లు, చివరకు జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయన్నా అధికారులు వినడం లేదు. మరి అక్రమ నిర్మాణాలైతే వాటికి ప్రభుత్వ అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తుంటే మాత్రం అధికారులు నీళ్లు నమలుతున్నారు. రాత్రనక, పగలనక కష్టపడి, రూపాయి, రూపాయి కూడబెట్టి ఎన్నో కలలతో నిర్మించుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడంతో ఎందరో అమాయకులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం!
మరోవైపు, హైడ్రా దెబ్బతో నగరంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఫ్లాట్ గానీ, ఇల్లు గానీ కొనాలన్నా, అమ్మాలన్నా ప్రతిఒక్కరూ వణికిపోతున్నారు. ఇక ఇళ్ల అమ్మకాల్లో ఏకంగా 42 శాతం తగ్గుదల నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్ ప్రజల్లో ‘హైడ్రా’ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్‌లో భారీ దెబ్బ తప్పదని, ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నగర ప్రజల్లో ‘హైడ్రా’పై, తద్వారా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకునే పనిలో పడింది. ‘హైడ్రా’ బాధితులను తమ పార్టీ ఆదుకుంటుందని, బాధితులందరూ వివరాలతో సహా తమ పార్టీ ఆఫీసుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు.