తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Janwada Farm house: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ!

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ నటులు అరెస్టైన ఘటన మరువక ముందే.. తెలంగాణలో మరోసారి రేవ్ పార్టీ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌ జన్వాడలో ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్‌ కాలనీలో ఉన్న రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు.

డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్!

ఫామ్‌హౌస్‌ యజమానిని కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలగా గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్‌ మద్దూరి అనే వ్యక్తి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 34 కింద మరో కేసు నమోదు చేశారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్‌ కార్డ్స్‌, ప్లాస్టిక్‌ కాయిన్స్‌ సైతం ఇక్కడ లభ్యమయ్యాయి. దీంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 30 ఎకరాల్లో రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌ విస్తరించి ఉంది.

రేవ్ పార్టీలో ఎవరున్నా వదలొద్దు!

కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌ పార్టీలా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ‘రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై కేటీఆర్‌ ఇప్పుడేమంటారో. డ్రగ్స్‌ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో? కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ ఫుటేజ్‌ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. బడా నేతలతో సహా రేవ్‌ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలి’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button