తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: ముఖం చాటేస్తున్న వానలు.. ఖరీఫ్ సాగుకు నీటి కటకటేనా?

వానాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఖరీఫ్‌ ఆయకట్టు సాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే కొన్ని జిల్లాల్లో తక్కువగా నమోదైంది. అయితే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి ప్రవాహాలు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల మాత్రం నామమాత్రంగా వస్తోంది. ప్రాణహిత నుంచి మేడిగడ్డకు 16వేల క్యూసెక్కులు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నీ నీటి ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలంలోకి ఇప్పటివరకు కేవలం ఆరున్నర టీఎంసీలు రాగా, నాగార్జునసాగర్‌లోకి మాత్రం దాదాపు లేనట్లే. ఎగువన ఉన్న జూరాలలోకి 7 టీఎంసీలు రాగా, తుంగభద్రలోకి కూడా 8 టీఎంసీలు వచ్చాయి. ఇప్పటివరకు నీరు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం కూడా జరగలేదు.

Read also: Meeting: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ… అందరిలోనూ ఉత్కంఠ!

కృష్ణాబేసిన్‌లో ఎగువన కర్ణాటకలో ఉన్న ఆలమట్టిలోకి కూడా ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 25 టీఎంసీలు మాత్రమే ఆలమట్టిలోకి రాగా, నిన్న కొంత ప్రవాహం పెరిగి 53 వేల క్యూసెక్కులు వస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లలోకి 90 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలంలోకి నీటి విడుదల ప్రారంభం కాదు. గత ఏడాది వర్షాభావంతో ఆయకట్టు సాగుపై ప్రభావం పడటంతో పాటు రిజర్వాయర్లలో నీటిమట్టం కనీస స్థాయికంటే దిగువకు పడిపోయింది.

గోదావరి బేసిన్‌లో కూడా ఇప్పటివరకు పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టు ఉన్న శ్రీరామసాగర్‌లోకి కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. సింగూరు, నిజాంసాగర్‌లోకి ఎలాంటి ప్రవాహం లేదు. కడెం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఇలా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి కూడా ప్రవాహాలు లేవు. రెండు బేసిన్లలోని 36 మధ్యతరహా ప్రాజెక్టుల కింద నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పెద్దవాగు, జగన్నాథపూర్, తాలిపేరు మినహా మిగిలిన మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు లేకపోవడంతో సాగు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

Back to top button