
King Fisher Beers: తెలంగాణలో ‘కింగ్ ఫిషర్’ బీర్ల సరఫరా పునరుద్ధరణ!
బీర్ ప్రియులకు శుభవార్త అందింది. తెలంగాణలో ‘కింగ్ ఫిషర్’ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) తెలిపింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్‌తో చర్చలు జరిపామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిండంతో బీర్ల సరఫరాను తక్షణమే పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీఎల్ ప్రకటించింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది.
ఆదాయానికి గండి పడుతుందని..!
కాగా.. గత రెండేళ్లుగా కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా చేసే యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 702 కోట్లు బకాయి పడింది. అంతేకాదు, బీర్ ధరల్ని సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ ప్రకటించింది. సాధారణంగా తెలంగాణలో ‘కింగ్ ఫిషర్’ బీర్లకే డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో కేఎఫ్ బీర్ల సరఫరా నిలిచిపోతే ఆదాయంపై భారీగా గండిపడే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం తాజాగా ఆ కంపనీతో చర్చలు జరిపింది. బకాయిల విడుదలతో పాటు, ధరల సవరణపై సానుకూలంగా స్పందించింది.