
Konda Surekha: కొండా సురేఖ ‘అతి’ చేస్తున్నారు.. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేతలు!
కాంగ్రెస్ పార్టీకి మంత్రి కొండా సురేఖ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఆమె నోటి దురుసు ఆమెకు కష్టనష్టాలు తీసుకొస్తోంది. సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో ఇప్పటికే నోరు పారేసుకొని టాలీవుడ్‌ని గెలికి చివరకు పరువు నష్టం కేసు వేయించుకునే దాకా వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి సురేఖపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన సురేఖ… రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. సురేఖకు వాగ్దాటి ఎక్కువే. అయితే ఒక్కోసారి ఆమె నోటి దురుసు ప్రదర్శిస్తారనే చెడ్డ పేరు కూడా లేకపోలేదు.
భార్యాభర్తల ఓవరాక్షన్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కొండా సురేఖ, ఆమె భర్త మురళి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వస్తున్నాయి. కొండా సురేఖను తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో వాళ్లంతా భేటీ అయ్యారు. సురేఖ విషయమై తాడోపేడో తేల్చుకోడానికి వాళ్లంతా సిద్ధమైనట్టు సమాచారం. రెండు రోజుల క్రితం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సురేఖ అనుచరుల మధ్య ప్లెక్సీ విషయమై గొడవ జరిగింది. సురేఖ అనుచరుల్ని రేవూరి వర్గీయులు చావబాదారు. దీంతో వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లింది. దాడిలో సురేఖ వర్గీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కొండా సురేఖ తీవ్ర ఆవేశంలో ఉన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి సురేఖ, రేవూరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇద్దరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆయన సూచించారు.