KTR: రంగంలోకి ఏసీబీ.. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్?
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ- రేసింగ్‌లో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై గవర్నర్ అనుమతితో ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. నేడో.. రేపో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
సవాల్ చేసిన వెంటనే కేసు నమోదు!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఫార్ములా ఈ రేస్, ఏస్ నెక్ట్స్ సంస్థల మధ్య ఒప్పందంతో ఈ రేసు నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద సచివాలయం ఎదుట ఫార్ములా రేస్ నిర్వహించారు. అయితే ఈ నిధుల్ని మంత్రివర్గ ఆమోదం లేకుండా అప్పనంగా ప్రైవేటు సంస్థలకు పంపారని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచీ ఆరోపిస్తోంది. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఈ-కార్ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేసిన వెంటనే ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. మరోవైపు కేటీఆర్‌పై అక్రమంగా కేసు పెట్టారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో పాటు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.