KTR: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. పాదయాత్రకు సిద్ధమైన కేటీఆర్!?
అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత వీక్ అయ్యింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో అప్పటికే అధికారం కోల్పోయామన్న బాధలో ఉన్న ఆ పార్టీని ఈ పరిణామం తీవ్ర ఆందోళనలకు గురిచేసింది. కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితులు అన్నీ చక్కదిద్దుకుంటూ వెళ్లారు. పోయినవారు పోగా ఉన్నవారు ఫిరాయింపులకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిక్షణం పోరాడుతూ రేవంత్ సర్కారుకు ఊపిరి సలపకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ పోరాటాలకు ప్రజల నుంచి కూడా మద్దతు గట్టిగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటారా?
ఇటీవల ‘ఎక్స్’ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు ప్రభుత్వాల అప్రజాస్వామిక వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టడంతో పాటు తమ పార్టీలను బలోపేతం చేసుకునేందుకు సంబంధిత అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని, మీరెప్పుడు చేస్తారనే ప్రశ్న కేటీఆర్‌కు ఎదురైంది. బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక కూడా అదేనని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో కేటీఆర్ పాదయాత్రపై బీఆర్ఎస్‌లో తీవ్ర చర్చజరుగుతోంది. పాదయాత్రకు ఇదే మంచి సమయమని ఆ పార్టీ సీనియర్ నేతలు సైతం సలహాలు ఇస్తున్నారట. ఇప్పటికే ‘హైడ్రా’, జీవో 29, ఏక్ పోలీస్, రైతుకు పెట్టుబడి సాయం తదితర విషయాల్లో ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బీఆర్ఎస్ కూడా ఈ పరిస్థితిని క్యాష్ చేసుకొని ఉద్యమకారుల తరుఫున పోరాటం కూడా చేసింది. ఈ ఊపు తగ్గకముందే కేటీఆర్ పాదయాత్ర చేస్తే పార్టీకి ప్లస్ అవుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ బలోపేతానికి పాదయాత్ర ఎనర్జీ ఇస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.