KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా?.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ సెటైర్లు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా విజయోత్సవాలను ప్లాన్ చేసింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. కుంభకోణాల కుంభమేళా అని విమర్శించారు.
అది కరప్షన్ కార్నివాల్!
రాష్ట్రంలో ఏడాది కాలంగా కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా? అని విమర్శలు గుప్పించారు. ‘ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్”. ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ?’ అంటూ మండిపడ్డారు.