KTR: ఫార్ములా ఈ-కార్ రేస్.. కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్!
ఫార్ములా ఈ – కార్ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రిలీఫ్ లభించింది. ఈ కేసులో కేటీఆర్ ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు
కాగా.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారంలో కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ లేఖ రాయగా, అందుకు ఆయన అందుకు అంగీకరించారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై 13(1)(ఏ) రెడ్‌విత్, 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్‌విత్, 120(బి) ఐపీసీ సెక్షన్స్ కింద గురువారం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. రూ. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడి (ఏ1)గా కేటీఆర్‌ను చేర్చింది. రెండో నిందితుడి(ఏ2)గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్‌కుమార్, మూడో నిందితుడి(ఏ3)గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని పేర్కొంది.