KTR: రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు!
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలపై పట్ల పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ చేతకాని పాలనతో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారని, చివరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు కనీసం ధాన్యం కొనుగోలు చేయలేదని, వర్షాలతో ధాన్యమంతా తడిచిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏం వెలగబెడుతున్నారు?
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు.. పంటను కొనుగోలు చేయడం చేతగాదు అని కేటీఆర్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారు? అని నిలదీశారు. అన్నదాతల అవస్థలను తీర్చడానికి తీరికలేదా..? ఢిల్లీ టూర్లు, విదేశీ యాత్రలేనా పాలన అంటే..? అని కేటీఆర్ ప్రశ్నించారు.