KTR: భారీ స్కెచ్.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్ అంశంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
ఈడీ కూడా రంగంలోకి!
ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. అంతేకాదు, ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు.
పొంగులేటి చెప్పిన రాజకీయ బాంబు ఇదేనా?
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా తెలంగాణలో రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. ఈ పరిణామాలన్నీ గమినిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించినట్లు స్పష్టమవుతోంది. మరి ఈ ఉచ్చులో నుంచి కేటీఆర్ ఎలా బయటపడతారో చూడాలి.