KTR: హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు.. ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ తప్పదా?
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కేసులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. అంతేకాదు, అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఉపసంహరించింది.
సుప్రీంకోర్టుకి కేటీఆర్..!
ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ క్షణంలోనైనా కేటీఆర్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయటంతో ఏసీబీకి లైన్ క్లియర్ అయిందని.. ఎప్పుడైనా ఆయన్ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ విషయమై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు.