MIM: బీఆర్ఎస్ నేతల జాతకాలు మా చేతుల్లో ఉన్నాయ్.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీల మధ్య చక్కని మైత్రీబంధం కొనసాగుతోంది. అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎంఐఎం పార్టీ గులాబీ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో స్నేహంగా ఉండటం ఎంఐఎం పార్టీకి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ అధికార కాంగ్రెస్‌కు దగ్గరైనట్లు తెలుస్తోంది. ఇందుకు అసదుద్దీన్ తాజా వ్యాఖ్యలే నిదర్శనం.
అప్పుడు మా వల్లే ఎక్కువ సీట్లొచ్చాయ్!
ఇవాళ హైదరాబాద్‌లో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ‘మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా? అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారు. ఆ పార్టీ నేతల జాతకాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి. ఆ పార్టీకి జీహెచ్‌ఎంసీలో ఎక్కువ సీట్లు మా చలవే. ఎంఐఎం మద్దతుతోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేది. అప్పట్లో ఆ పార్టీ నేతలకు అహంకారం ఉండేది.’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యల్ని బట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలనే ఇలా మాట్లాడుతున్నారని వినిపిస్తోంది.