MLC Kavitha: లిక్కర్ స్కాం కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్!
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 166 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు.
ఈ ఏడాది మార్చి 15న ఎమ్మెల్సీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. కవితను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్ట్ వారెంట్‌తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె అనేక సార్లు రౌస్ ఎవెన్యూ కోర్టులో, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు బెయిల్ లభించింది. కవితకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.