TBJP: కమలనాథుల సరికొత్త వ్యూహం.. తెలంగాణ బీజేపీకి కొత్త సారథి?
తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి బాధ్యతలు, అటు అధ్యక్ష బాధ్యతలతో సతమతవుతున్నారు. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ జాతీయ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి ఎవరు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సారి కూడా మంచి ఫామ్‌లో ఉన్న గట్టి నాయకుడికే రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు.
బరిలో ఆరుగురు
ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కమలం శ్రేణుల్లో నెలకొంది. అధ్యక్ష పదవి కోసం అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు సైతం పోటీ పడుతున్నారు. దాదాపు ఆరుగురు నేతలు పోటీ పడుతున్నా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌ల మధ్యే గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలలో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీలో లాబీయింగులు కూడా మొదలుపెట్టేశారట.
ఎవరికి ఛాన్స్?
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అధ్యక్ష పీఠం అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు ప్లస్ పాయింట్స్. ఇక, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డా అయిన మహబూబ్ నగర్ నుంచి గెలుపొంది రికార్డు సృష్టించారు. ఈక్రమంలో డీకే అరుణ కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం పరితపించారు. ఇందుకు సంబంధించిన లాబీయింగ్ సైతం చేశారు. అయితే ఆశాభంగం కలిగింది. చివరకు బీజేపీ చీఫ్ పదవి అయినా దక్కుతుందా అన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న యువ నేతలు ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావులు కూడా ఈటలకు, డీకే అరుణకు గట్టి పోటీ ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో, యువతలో రఘునందన్ రావుకు, ఇటు ధర్మపురి అర్వింద్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వగలరు. అంతేకాదు, ఈ ఇద్దరికీ కూడా పార్టీలో మంచి కేడర్ కూడా ఉంది. దీంతో వీరిలో ఎవరో ఒకరు అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.