తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: రైతు భరోసాపై సలహాలు, సూచనలు… రైతుల అభిప్రాయం ఏమిటంటే?

రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.

రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ లోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటుంది. రైతు వేదికలు, వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా, మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చిన రైతులు, రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తుంది.

ఇప్పటివరకు సుమారు 31 వేల మంది నుంచి లిఖిత పూర్వకంగా సలహాలు సేకరించినట్టు తెలిసింది. అందులో మెజార్టీ మంది ఐదెకరాలకు కటాఫ్ పెట్టి, రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పినట్టు సమాచారం. అసలైన రైతులకు ప్రయోజనం కలగాలంటే, కండీషన్లు పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు, సూచనలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీకి సమర్పించే చాన్స్ ఉంది.

రైతు భరోసా స్కీమ్‌ను కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దీంతో కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతుంది. ఎలా గుర్తించాలి అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎంత మంది అఫిడవిట్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనే అనుమానం అధికారులకు పట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button