TG Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణపై దోబూచులాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇక విస్తరణకు ముహూర్తం ఖరారు చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆశావహుల లాబీయింగ్!
ఇక, అధిష్టానం నుంచి వీరికి పిలుపు రాగానే ఆశావాహులు ఇక్కడ లాబీయింగ్ మెుదలు పెట్టేశారు. మంత్రివర్గం రేసులో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్ సోదరులు ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. తమ సీనియారిటీ, సిన్సియారిటీ పరిగణించాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఆశావహులు సంకేతాలు పంపుతున్నారు.
ప్రస్తుతం 11 మందే!
గతేడాది డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ మంత్రులలో కొంతమంది దగ్గర అత్యధిక శాఖలు ఉన్నాయి. కొంతమందితోనే కేబినెట్ కొలువుదీరిన నేపథ్యంలో త్వరలోనే విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు.. ఇతర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. దాంతో మంత్రి వర్గ విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మంత్రి వర్గ విస్తరణపై హస్తం పార్టీ ఢిల్లీ పెద్దలు దృష్టిపెట్టారు.