Congress vs BRS: గ్రేటర్లో వేడెక్కిన రాజకీయం.. అసలు అరికెపూడి గాంధీ vs కౌశిరెడ్డి మధ్య గొడవ ఏంటి?
గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, దాడులు, ప్రతిదాడులు, ఫిర్యాదులతో హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ (బీఆర్ఎస్), అరికెపూడి గాంధీ (కాంగ్రెస్)ల మధ్య వివాదం మరింత ముదిరిపోతుంది. కౌశిల్ వేసిన సవాల్ స్వీకరించిన గాంధీ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ సిటీ కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్, నిన్న చీరా – గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది. ఇంతకీ వీరిద్దరి మధ్య చెలరేగిన వివాదం ఏంటీ? ఇద్దరు నేతలు ఏం సవాళ్లు విసురుకున్నారన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సవాల్.. ప్రతిసవాల్
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని పీఏసీ చైర్మన్‌గా కూడా నియమించింది. ఈ నియామకంపై బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఆయనపై బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అరికెపూడి. అతను కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడని.. అతని వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘నీ ఇంటికి వస్తా.. నీ ఇంటిపైనే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా? అంటూ సవాల్ విసిరిసారు. దీనికి ప్రతి సవాల్‌గా ‘దమ్ముంటే నా ఇంటికి రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అంటూ అరికపూడి గాంధీ అన్నారు.
రాళ్ల దాడి.. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
కౌశిక్ రెడ్డి విసిరిన సవాల్‌ని అరికపూడి గాంధీ సీరియస్‌గా తీసుకున్నారు.. తన అనుచరులతో కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తనపై సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి సమాధానం ఇవ్వాలని అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉండటంతో గాంధీ, కౌశిక్ రెడ్డి అనుచరులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా అరికపూడి గాంధీ మాట్లాడుతూ.. నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తా అంటూ సవాల్ విసిరితే ఖాళీగా కూర్చున్నామా? కేసీఆర్ లాంటి వారు ఆ వ్యాఖ్యలు చేస్తే స్వాగతించేవాడిని.. నాతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగినా సమాధానం చెప్పేవాడిని.. కౌశిక్ రెడ్డి లాంటి స్వార్థపరులు నోరు పారేసుకుంటూ చూస్తూ ఊరుకోం’ అని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతుందని.. సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఏం కల్పిస్తుందని ప్రశ్నించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ సీపీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడంతో హరీశ్ రావుతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఇక శుక్రవారం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తాం అంటూ మరో సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. మరి ఈ రచ్చ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.