TTDP: మళ్లీ తెర మీదకి ‘తెలంగాణ టీడీపీ’.. అసలు చంద్రబాబుకు ఆ ఛాన్స్ ఉందా?

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వీలు కుదిరినప్పుడల్లా హైదరాబాద్ వచ్చి కాస్త హడావిడి సృష్టిస్తూ ఇక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. అంతేకాదు, పార్టీలోకి ఎవరొచ్చినా సరే అంటూ ఎన్టీఆర్ భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంచుతున్నారు. ఇక, ఇటీవల చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతానని ప్రకటించడంతో మళ్లీ ‘తెలంగాణ టీడీపీ’ అంశం తెరమీదకి వచ్చింది. ఎల్. రమణ, కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని వదిలిపోయిన తర్వాత ఇక తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్లే అనే వాదనలు వినిపించాయి. కానీ తాజాగా తీగల కృష్ణారెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా చంద్రబాబును కలవడంతో తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది.
మనుమరాలి పెళ్లికి ఆహ్వానం సాకు మాత్రమే!
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబుతో తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి భేటీ అయ్యారు. వీళ్లు ముగ్గురూ దగ్గరి బంధువులే కావడం గమనార్హం. బాబును కలవగానే తీగల తాను టీడీపీలో చేరుతున్నట్లు మీడియాకు చెప్పేశారు. ఇక మల్లారెడ్డి, ఆయన అల్లుడు కూడా టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి మీద ఇలాంటి ఊహాగానాలు గతంలోనూ వచ్చాయి. పైకి తన మనుమరాలి పెళ్లికి బాబును ఆహ్వానించాలని వచ్చినట్లు చెబుతున్నా టీడీపీలో చేరుతానని చెప్పడానికే మల్లారెడ్డి.. చంద్రబాబును కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రేవంత్ నుంచి తప్పించుకునేందుకేనా?
రేవంత్ సర్కార్ నుంచి ఇబ్బందుల్ని తప్పించుకోవడానికే మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నట్లు వినిపిస్తోంది. మల్లారెడ్డి కాలేజీల మీద ఇప్పటికే హైడ్రా కన్ను పడింది. రేపో మాపో వాటిని కూల్చి వేసినా కూల్చివేయచ్చు.. చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ గురువు కాబట్టి ఆయన చెబితే వింటాడని మల్లారెడ్డి భావిస్తున్నారట. మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన పోలేరు. బీజేపీలో చేరినా ఉపయోగం లేదు. కాబట్టి చంద్రబాబుతో రేవంత్‌ని బుజ్జగించి హైడ్రా నుంచి తప్పించుకోవడానికి మల్లారెడ్డి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ సరే గానీ.. తెలంగాణ టీడీపీలో ఎంతమంది చేరినా ఆ పార్టీని ఇక్కడ ఎవరు ఆదరిస్తారన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది. తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయిన ఆ పార్టీ పూర్వ వైభవం తేవడం అంత సులువేం కాదని, ఇప్పటికే పార్టీ క్యాడర్ మొత్తం రకరకాల పార్టీల్లో చేరిపోయిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.