తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Yadadri: సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం.. యాదాద్రి ఇకపై యాదగిరి గుట్ట!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలనలో ముందు నుంచీ తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న ఆయన తాజాగా మరో మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే టీఎస్‌ను టీజీగా మార్చిన ఆయన.. తాజాగా యాదాద్రి పేరును సైతం మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో యాదగిరిగుట్టగా ఉన్న పేరునే బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రిగా పేరు మార్చారు. ఇప్పుడు మళ్లీ అదే పేరును కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

వారంలో పూర్తి ప్రతిపాదనలు

గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button