America Elections: రేపే అమెరికా ఎన్నికలు.. ప్రజాతీర్పు ఎటువైపు?
నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని గంటల్లోనే అమెరికా ప్రజలు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. రేపు జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహిళా నేత, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా, డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2020 సంవత్సరంలో బైడెన్, ట్రంప్ ముఖాముఖీగా తలపడినప్పుడు కొవిడ్ -19 మహమ్మారి అతిపెద్ద సమస్య. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి.. ఆ దేశ సమస్యలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి.
ఫలితాలను నిర్ణయించేది వారేనా?
సాంకేతికంగా అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన అక్కడి ప్రజలు ఉపాధి, విద్య, ఆరోగ్యం, రుణమాఫీ వంటి వారి రోజువారీ సమస్యలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈసారి అమెరికా ఫలితాలను నిర్ణయించేది కూడా వారేనని అనేక సర్వేలు తెలిపాయి. అంతేకాదు, అబార్షన్, ఇమ్మిగ్రేషన్ వంటి సున్నితమైన సమస్యలు కూడా ప్రజలపై ప్రభావం చూపుతాయి. ఈ రెండు అంశాలపై అభ్యర్థులిద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. కమలా హారిస్ విజయం సాధిస్తే అమెరికాలో వలసదారులే ఆధిపత్యం చెలాయిస్తారని ట్రంప్ చెబుతుండగా.. మహిళల అబార్షన్ హక్కులకు భంగం వాటిల్లుతుందనే భయాన్ని మహిళలకు చూపుతూ కమలా హారిస్ మద్దతు కూడగడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ వివాదాస్పద అంశాలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
భారత్‌పై ప్రభావం ఎంత?
ఇప్పుడు అమెరికా ఎన్నికలు భారతదేశంపై ఎలా ప్రభావం చుపిస్తాయనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా భారతదేశాన్ని ప్రభావితం చేయదు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా భారతదేశం-యూఎస్ సంబంధాలలో స్థిరత్వం, వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుంది. ఎవరు గెలిచినా భారత్‌తో వాణిజ్యం, సైనిక భాగస్వామ్యాలు స్థిరమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారత్‌తో తమ బంధాన్ని బలపరుచుకునే విధంగా అమెరికా అధ్యక్షుడు ఆలోచనలతో అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.