తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

CM Revanth Reddy: కాంగ్రెస్‌ను కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధితోపాటు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సూచనలను ఈ ప్రభుత్వం తప్పక పాటిస్తుందన్నారు. రైతు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి అక్కడి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్​ అండ్​ ఆర్​ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. పెండింగ్​ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మహబూబ్​నగర్​ జిల్లాలో రూ.396.09 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో అభివృద్ధి పనులు, మహిళా శక్తి క్యాంటీన్, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంతోపాటు మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.

కేసీఆర్‌కు కాంగ్రెస్ ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని, పరీక్షలు పదే పదే వాయిదా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కూల్చేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. తన వరకు వస్తే కాని కేసీఆర్‌కు ఆ బాధ తెలియలేదని, గత పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం నెల రోజులలోనే కూలిపోతుందని కేసీఆర్‌ అనలేదా? 11వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఎన్నో ఏళ్లుగా జరగని డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారన్నారు. హయాంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో అమ్ముకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Also Read: ‘మూడోసారి ప్రధాని అయ్యా.. భారత్ ను బలమైన మూడో ఆర్థికశక్తిగా నిలబెడతా’

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే మళ్లీ కోర్టుకు వెళ్తారన్నారు. నోటిఫికేషన్‌లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని కోర్టు మళ్లీ రద్దు చేస్తుందని, పదే పదే పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోందన్నారు. పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌ వెనుక కోచింగ్‌ సెంటర్ల కుట్ర కూడా ఉందని, నిరాహార దీక్షల్లో పేద విద్యార్థులు, పేద నేతలు మాత్రమే ఎందుకు కూర్చుంటున్నారన్నారు. దీక్షల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు ఎందుకు కూర్చోవడం లేదు. వారిద్దరూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు దీక్షకు కూర్చుంటే.. రక్షణ కల్పిస్తామన్నారు. విద్యార్థుల చావులతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button