
Donald Trump: ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ రద్దు చేసిన ట్రంప్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశారు. అందరూ ఊహించినట్టుగానే ట్రంప్ తొలి రోజు నుంచే దూకుడుగా ముందుకు వెళ్తూ తన స్టైల్లో పాలన సాగిస్తున్నారు. వచ్చీ రాగానే ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష వంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక, తాను ముందే ప్రకటించినట్టు అమెరికా నేలపై జన్మించే వారికి సహజంగా లభించే ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా దేశ పౌరసత్వం దక్కుతుంది. దీనినే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటారు.
ఇండియన్స్‌పై ప్రభావం!
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇతర నిర్ణయాల గురించి పక్కన పెడితే.. ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ను రద్దు చేయడం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ నిర్ణయంతో గ్రీన్‌కార్డులు, హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులు జన్మనిచ్చే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులకు పౌరసత్వం లభించడంపైనే పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశం ఉందని, హెచ్-1బీ వీసా కలిసిన తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని ఇమిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. అమెరికా గ్రీన్‌కార్డుల కోసం లక్షలమంది భారతీయులు ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో పౌరసత్వం రావడం కలగానే మారిపోనుందని వాపోతున్నారు.