తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Heavy Rains: విజయవాడ, ఖమ్మంలలో జల ప్రళయం.. జనజీవనం అస్తవ్యవస్తం!

సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం మళ్లీ ముంపునకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణలకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇక గత రెండు రోజులుగా కనివిని ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలు, వాటి కారణంగా భారీ వరదలతో విజయవాడ నగరం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇళ్లు కొట్టుకుపోయి ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. లోతట్టు ప్రాంతాల వారిని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నా.. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగడం లేదని బాధితులు పలు చోట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో పొరుగునే ఉన్న గుంటూరు నగరం సైతం జలాశయాన్ని తలపిస్తున్నది. ప్రకాశం బ్యారేజీకి అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరింది. విజయవాడ నగరంలో ఎటు చూసినా వర్షపు నీరు నిలిచిపోయి దారులన్నీ వాగులుగా మారిపోయాయి. గడిచిన 50 సంవత్సరాలలోనే ఇంతటి వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.

రికార్డు స్థాయి వర్షపాతం నమోదు!

విజయవాడ మీదుగా ప్రవహించే కృష్ణా నది ఒకవైపు, బుడమేరు వాగు మరోవైపు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. ఆదివారం ఒక్కరోజే విజయవాడ నగరంలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది గత 30 ఏళ్లలో అత్యధిక ఏకైక రోజు వర్షపాతం అని అధికారులు చెబుతున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో 37 సెంటీమీటర్ల దాకా వర్షం కురిసినట్టు తెలుస్తున్నది. దీంతో విజయవాడలో బుడమేరు ఉప్పొంగి, 40% నగరం నీట మునిగింది. మరోవైపు తెలంగాణ ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద పెనుముప్పుగా పరిణమించింది. వాగులు, వంకలు కృష్ణానదిలో కలవడంతో కృష్ణా నది ఉధృతస్థాయిలో ప్రవహిస్తున్నది. 2005లోనూ విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో బడుమేరు ఉప్పొంగడంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే.. 2005 వరదలతో పోల్చితే ఇప్పుడు వచ్చిన వరదలు రెండింతలు అధికమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఖమ్మంను ముంచెత్తిన వరదలు

ఇక, తెలంగాణలోని ఖమ్మం జిల్లాను కూడా వరదలు కకావికలం చేశాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దాదాపు 15 గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఖమ్మం-సూర్యాపేట, ఖమ్మం-మహబూబాబాద్‌ జిల్లా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో భారీగా వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. మున్నేరు వరద గంటల వ్యవధిలో ముంచెత్తటంతో ఖమ్మం నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మున్నేరు వాగు నీటిమట్టం 36 అడుగులకు పైగా చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు వరద పోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. శనివారం రాత్రి వరకు 11 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 36 అడుగులు దాటింది. రామన్నపేట, దానవాయిగూడెం కాలనీ, గణేశ్‌నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వరనగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్‌వెల్‌ రోడ్, బురద రాఘవాపురం, ధంసలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టుముట్టింది. చంటిపిల్లలు సహా మహిళలు, వృద్ధులు వరదలో చిక్కుకున్నారు. వందల మంది బాధితులు హాహాకారాలు చేశారు. కొన్ని కాలనీల్లోని బాధితుల్ని అధికార యంత్రాంగం పడవల్లో బయటకు తీసుకొచ్చింది. పలు ఇళ్లలో నిత్యావసరాలు, ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. పలు కాలనీల్లో సుమారు 300 మంది భవనాలపైకి చేరి.. సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. నగరానికి మూడు వైపులా మున్నేరుపై ఉన్న మూడు వంతెనలు మూసివేశారు. నగరంలో రెండోవైపు కాల్వలు, నాలాల ఆక్రమణలతో పలు కాలనీలను వరద ముంచెత్తింది. శ్రీనగర్‌ కాలనీ, చెరువుబజార్, చైతన్యనగర్, కవిరాజ నగర్, ప్రశాంతినగర్, టేకులపల్లి, రోటరీనగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇవాళ ఖమ్మంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా రూ. 10 వేలు అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button