తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

IND vs NZ: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. సొంత గడ్డపై భారత్ ఘోర ఓటమి!

సొంత‌గ‌డ్డ‌పై భార‌త జ‌ట్టు 12 ఏళ్ల జైత్ర‌యాత్ర‌కు న్యూజిలాండ్ చెక్ పెట్టింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో వ‌రుస‌గా 18 సిరీస్ విజ‌యాల‌తో రికార్డు సృష్టించిన టీమిండియాకు కివీస్ ఊహించ‌ని షాకిచ్చింది. పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై కివీస్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 245 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77) రాణించగా.. మిగతావారు భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.

12 ఏళ్ల తర్వాత!

భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో విదేశీ గడ్డపై కివీస్‌ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన టీమిండియా పుష్కరకాలం తర్వాత సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం. మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబయి వేదికగా ప్రారంభం కానుంది.

చెలరేగిన మిచెల్ శాంట్నర్!

రెండో ఇన్నింగ్స్‌లో 198/5 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌ 255 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్‌ఇండియా 34 పరుగుల వద్ద రోహిత్ శర్మ (8) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (23)తో కలిసి జైస్వాల్ నిలకడగా ఆడటంతో భోజన విరామ సమయానికి భారత్‌ 81/1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ, రెండో సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఓటమి అక్కడే ఖాయమైపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. యశస్వి జైస్వాల్‌, గిల్, విరాట్ కోహ్లీ (17), సర్ఫరాజ్‌ ఖాన్‌ (9)లను ఔట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. రిషభ్ పంత్ (0) అనవసరంగా రనౌటయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా (42) పోరాడినా ఫలితం లేకపోయింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button