Kakinada GGH: చరిత్ర సృష్టించిన కాకినాడ వైద్యులు.. జూ. ఎన్టీఆర్ ‘అదుర్స్’ సినిమా చూపిస్తూ ఆపరేషన్!
సాధారణంగా ఏ ఆపరేషన్ జరిగినా.. పేషెంట్‌కు వైద్యులు అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా నొప్పిని తెలియకుండా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ పేషెంట్‌కు అనస్థీషియా ఇవ్వకుండా.. సినిమా చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ తన చేతులతో ట్యాబ్ పట్టుకుని మూవీలోని కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని తొలగించారు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది.
ట్యాబ్‌లో ఆమెకు నచ్చిన ‘అదుర్స్’ సినిమా చూపిస్తూ..
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ. కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి మెదడులో కణితి ఏర్పడింది. పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా.. ఫలితం లేదు. అనంతలక్ష్మి తలలో పెద్ద కణితి ఉందని, ఆపరేషన్‌కు చాలా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. సెప్టెంబర్ 11న అనంతలక్ష్మికి తలనొప్పి వచ్చి మూర్ఛపోయారు. ఆమె శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయాయి. దాంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించి.. మెదడులో ఎడమవైపు కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతలక్ష్మికి వెంటనే అధునాతన పద్ధతిని ఉపయోగించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ తరుణంలోనే… ట్యాబ్లో ఆమెకు నచ్చిన ‘అదుర్స్’ సినిమా చూపిస్తూ అవేక్ క్రేనియాటమీ ఆపరేషన్ చేశారు. తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఈ శస్త్ర చికిత్స చేయడం వలన ఇబ్బందులు తెలుసుకుంటూ వైద్యం చేయవచ్చని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అనంతలక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో అయిదు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు.