
Maha Kumbhamela: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. ప్రారంభమైన మహా కుంభమేళా..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ఘనంగా ప్రారంభమైంది. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్‌రాజ్‌లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళా వేడుకలు మొదలయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26తో ఈ వేడుకలు ముగుస్తాయి.
144 ఏళ్లకోసారి మాత్రమే!
సాధారణంగా ప్రతి ఆరు సంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అయితే, ఈసారి జరిగే మహా కుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మహా కుంభమేళా 144 సంవత్సరాలకోసారి మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఏటా కుంభమేళా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాలో జరుగుతుంది. అయితే, 144 సంవత్సరాలకోసారి జరిగే మహా కుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహా కుంభమేళా మొదలవుతుంది. భూమిపై ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. పన్నెండేళ్లకోసారి పూర్ణకుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. అందుకే 144 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాకు 44 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.