తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 17: చరిత్రలో ఈరోజు

రాయప్రోలు సుబ్బారావు జననం

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు 1892లో జన్మించారు. తెలుగులో భావ కవిత్వానికి ఈయన ఆద్యుడనే చెప్పాలి. 1913లో ఈయన రాసిన తృణకంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైందని అంటారు. కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు.

మందుముల నర్సింగరావు జననం

తెలంగాణ విమోచనోద్యమంలో కీలక పాత్ర పోషించిన మందముల నర్సింగరావు 1896లో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన్మించారు. 1921లో ఆంధ్రజన సంఘాన్ని స్థాపించారు. 1927లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలు చేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి నిజాం నిరంకుశ పాలనపై అనేక వ్యాసాలు రాశారు. 1937లో ఇందూరులో జరిగిన 6వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1952లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారు.

కల్పనా చావ్లా జననం

కల్పనా చావ్లా.. భారతదేశంలో జన్మించిన అమెరికన్ వ్యోమగామి, అంతరిక్ష ఇంజనీర్. అంతరిక్షంలోకి ప్రయాణించిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళగా పేరు గడించారు. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్‌లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు. 2003లో రెండోసారి అదే రకమైన స్పేస్ షటిల్‌లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకరు. 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

సైనా నెహ్వాల్ జననం

సైనా నెహ్వాల్.. భారత ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. హర్యానాలోని హిస్సార్‌లో 1990లో జన్మించారు. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించిన తొలి మహిళగా నిలిచారు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు.

మరికొన్ని విశేషాలు:

1967: భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించారు.

2012: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

1969: ఇజ్రాయెల్ నాల్గవ ప్రధాన మంత్రిగా గోల్డా మీర్ ఎన్నికయ్యారు.

1902: గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి ఆటగాడు అమెరికన్ గోల్ఫర్ బాబీ జోన్స్ జన్మించారు.

1957 – ఫిలిప్పీన్స్‌లోని సిబూలో విమాన ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు రామన్ మెగసెసేతో సహా 24 మంది మరణించారు.

1958 – యునైటెడ్ స్టేట్స్ మొదటి సౌరశక్తితో నడిచే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది దీర్ఘకాల కక్ష్యను సాధించిన మొదటి ఉపగ్రహం.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button