New Year: కొత్త ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన మార్పులివే.. ఓ లుక్కేయండి!
2025 ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. జీఎస్టీ విధానంలో మార్పులతో సహా రైతులకు ఎలాంటి హామీ లేకుండానే రూ. 2 లక్షల వరకు బ్యాంక్ రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించింది. మరి ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చిన కీలక మార్పులను గమనించండి.
జీఎస్టీ విధానంలో కీలక మార్పులు
జీఎస్టీ పోర్టల్‌లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి 1 నుంచి మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాటించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. మరోవైపు, 180 రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లకు ఈ-వే బిల్లులు (ఈడబ్ల్యూబీలు) జనరేట్ కావు.
ఫీచర్ ఫోన్లలో యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపు
‘యూపీఐ 123పే’ ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ్టి నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10,000 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా మునుపటి రూ.5,000 పరిమితిని ఆర్బీఐ పెంచింది. ఇటీవలే సర్క్యూలర్‌ను కూడా జారీ చేసింది.
రూ.2 లక్షల వరకు హామీ లేని రైతు రుణం
దేశంలోని రైతులు ఇకపై రూ.2 లక్షల వరకు హామీ లేని బ్యాంక్ రుణాన్ని పొందవచ్చు. ఈ మేరకు మునుపటి రూ.1.60 లక్షల పరిమితిని ఆర్బీఐ పెంచింది. ఈ కొత్త నిబంధన రైతులకు మరింత ఉపశమనం కల్పించనుంది. రైతు పెట్టుబడికి ఈ విధానం మరింత దోహదపడనుంది.
పెన్షన్ ఉపసంహరణ నిబంధనలు
పెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అనుమతించింది.
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
సులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది.
యూఎస్ వీసా రూల్స్
నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు.