Rationa Cards: కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్! ఎప్పటి నుంచి జారీచేస్తారంటే..?
తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. కొత్త రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి జారీ చేయనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు కావాలని గతంలో నిర్వహించిన ‘ప్రజా పాలన’లో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో అప్లై చేసుకోలేకపోయిన వారి కోసం మరోసారి ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనూ వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అందరికీ అక్టోబర్ నెలలో కొత్త కార్డులను జారీ చేయాలని ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ నేతృత్వంలో భేటీ అయిన సబ్ కమిటీ నిర్ణయించింది.
ఇప్పటికి నాలుగు పర్యాయాలు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ నెల 21వ తేదీన మరోసారి కూడా సబ్ కమిటీ సమావేశం కానున్నది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రేషన్ కార్డుల విధి విధానాలపై అధ్యయనం ఇప్పటికే పూర్తి చేశారు. కాగా ఆయా రాష్ట్రాలలో రేషన్ కార్డుల జారీకి పాటించిన విధివిధానాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణలో కూడా నిర్ణయించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.