Stampede at Sandhya Theatre: సంధ్య థియేటర్ ఇష్యూ.. ఎవరేం చెప్తున్నారు..!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణలో రాజకీయ, సినీ రంగాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్‌దేనని, పోలీసులు చెప్పినా వినకుండా ఆయన రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు, అసలు అల్లు అర్జున్‌కి థియేటర్ వద్దకు రావడానికి అనుమతి కూడా లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ ఘటనపై అల్లు అర్జున్ సైతం తన వాదనని వినిపిస్తున్నారు. ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని, అనుమతి ఉన్నందుకే తాను థియేటర్ వద్దకు వచ్చానని అంటున్నారు. తన క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఇంతకీ ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్.. ఓ లుక్కేద్దాం.
తప్పు పోలీసులదా? అల్లు అర్జున్‌దా?
థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇటు ప్రభుత్వానిది గానీ, అటు పోలీసులది గానీ తప్పేం లేదా? తప్పంతా కేవలం అల్లు అర్జున్‌దేనా? నిజానికి అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ వద్దకు వస్తున్నారని, అభిమానులు భారీగా వస్తారని సెక్యూరిటీ కల్పించాలని చిక్కడపల్లి పోలీసులకు థియేటర్ యాజమాన్యం ముందే లేఖ రాసింది. అంటే అనుమతి కూడా తీసుకుంది. ఈ లేఖ సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అంటే అల్లు అర్జున్ వస్తున్నారని, జనాలు భారీగా వస్తారని పోలీసులకు ముందే తెలుసు. కానీ బందోబస్తు కల్పించడంలో ఇటు పోలీసులు గానీ, అటు ప్రభుత్వం గానీ విఫలమైన మాట వాస్తవం. కానీ ఆ వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు అల్లు అర్జున్ మీద, థియేటర్ మీద ఆ నిందను వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తరుఫు లాయర్ వాదించినట్లు డ్యూటీ చేయాల్సిన పోలీసులే అల్లు అర్జున్‌ని చూసేందుకు ఎగబడ్డారని, కాబట్టి కంట్రోల్ తప్పి తొక్కిసలాట జరిగిందన్న వాదన కూడా ఉంది.
పేరు మర్చిపోయినందుకా? డైవర్షన్ రాజకీయాలా?
సరే.. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం, ఆయనను అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చినా ఏవో సాంకేతిక కారణాలు చూపించి ఒక రాత్రంతా జైల్లో పెట్టడం జరిగిపోయింది. ఇదంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగానే చేసిందా? అన్నది అనుమానం. ఎందుకంటే పుష్ప-2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్.. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు కక్షతోనే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇవి సీఎం రేవంత్ మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ అని మరికొందరు అంటున్నారు. ‘హైడ్రా’తో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. దీంతో ఆ వ్యతిరేకతను కొంతైనా పోగొట్టుకునేందుకు నగరంలో ఏం జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, నగర ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనే మెసేజ్‌ను ఇచ్చేందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని కూడా కొంతమంది అంటున్నారు.
అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్?
అసలు థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్నది ప్రశ్న. గతంలో చాలా సందర్భాల్లో రాజకీయ సభల్లో, ఇతర కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరిగాయి. 2024 మే 19న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉన్న కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగి పలువురు గాయాల పాలయ్యారు. అప్పుడు రాహుల్ గాంధీపై కనీసం కేసైనా నమోదైందా? యూపీలోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ బన్నీ ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు. అంతేకాదు, ‘హైడ్రా’ అధికారులు తమ ఇళ్లను కూల్చేస్తారని భయంతో గుండెపోటుతో మృతి చెందిన ఘటనల్లో సీఎంను కూడా అరెస్ట్ చేస్తారా? అంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నించడం చూశాం.
ఆరోపణలపై అల్లు అర్జున్ క్లారిటీ
ఇక, తాజా పరిణామాల గురించి మాట్లాడుకుందాం.. అల్లు అర్జున్ పోలీసులు చెప్పినా వినకుండా కావాలనే రోడ్ షో చేశారని, ఆయన వల్లే ప్రమాదం జరిగిందని అసెంబ్లీలో సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా అన్నారు. అంతేకాదు, సినిమా స్టార్లపై కూడా మండిపడ్డారు. తాను సీఎం కుర్చీలో ఉండగా బెనిఫిట్ షోలు ఇక ఉండవని అన్నారు. ఇక, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అయితే అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌కి పోలీసులు చెబితే వెంటనే నవ్వి.. సినిమా హిట్టే అని అన్నారని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం, అక్బరుద్దీన్ ఆరోపణల నేపథ్యంలోనే అల్లు అర్జున్ తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. తన క్యారెక్టర్‌ను కావాలనే తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, అసలు తనకు మహిళ చనిపోయిందన్న విషయం తెల్లవారిన తర్వాత తమ వాళ్లు చెబితేనే తెలిసిందని స్పష్టంచేశారు. అభిమాని చనిపోయిందన్న బాధలో ఉన్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, అవన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు.
కేవలం అల్లు అర్జున్‌నే బాధ్యుడిని చేయడం కరెక్టా?
ఒక్కటి మాత్రం క్లియర్.. ఎవరెన్ని చెప్పినా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అభిమాని రేవతి మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఇప్పటికీ ఆసుపత్రి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ ఉండటం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. ఈ ఘటన పట్ల అటు అల్లు అర్జున్ అయినా, ఇటు తెలంగాణ ప్రభుత్వమైనా బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. కానీ ఈ ఘటనకు పూర్తిగా అల్లు అర్జున్‌నే బాధ్యుడిని చేయడం కూడా కరెక్ట్ కాదని, ఇందులో తెలంగాణ ప్రభుత్వానిది, ముఖ్యంగా పోలీసుల వైఫల్యం కూడా ఉందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోలేకపోతున్న చేదు నిజం అని విశ్లేషకులు చెబుతున్నారు.