Trump: ట్రంప్ విజయంలో మనోళ్లదే కీలక పాత్ర.. కీలక పదవులు వారికే..!
అమెరికా ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ విజయంలో ఇండో-అమెరికన్లు కీలకపాత్ర పోషించారు. వారిలో వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, బాబీ జందాల్, నిక్కీ హేలి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి ట్రంప్ కార్యవర్గంలో ప్రాధాన్యం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివేక్ రామస్వామికి పెద్దపీట
2024 ఎన్నికల్లో ట్రంప్‌నకు పోటీదారుగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత ఆయన కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తి భారత మూలాలున్న వివేక్ రామస్వామి. 38 ఏళ్ల యువ కెరటం ట్రంప్ తరఫున ఇంటర్వ్యూల్లో వాదనలు వినిపించారు. అతడి పనితీరు గమనించిన ట్రంప్.. తన కార్యవర్గంలో కీలకపాత్ర లభించడం దాదాపు ఖాయం. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయన రామస్వామిని తన కార్యవర్గంలోకి తీసుకొంటానని కూడా ప్రకటించారు.
సీఐఏ అధిపతిగా కశ్యప్!
ప్రపంచంలోనే అత్యంత రహస్యమయ నిఘా సంస్థ అమెరికాకు చెందిన సీఐఏ. దానికి అధిపతిగా భారతీయ మూలాలున్న వ్యక్తి కశ్యప్ పటేల్‌ను నియమిస్తారన్న ప్రచారం జోరందుకొంది. ట్రంప్‌కు వీరవిధేయుడిగా ఆయనకు పేరుంది. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. అనంతరం ఆయన్ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు.
హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా జిందాల్
లూసియానా మాజీ గవర్నర్ బాబీజిందాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ట్రంప్ కార్యవర్గంలో ఆయనకు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ ఎ హెల్తీ అమెరికాకు అధిపతిగా ఉన్నారు. గతంలో రాష్ట్ర గవర్నర్‌గా చేసిన అనుభవం ఉండటంతో కార్యవర్గంలోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
నిక్కీ హేలీకి ఛాన్స్
తొలుత ట్రంప్‌ను విభేదించి దూరంగా ఉన్న నిక్కీ హేలీ ఎన్నికల వేళ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా గళం విప్పారు. తన మద్దతుదారులను కూడా ట్రంప్‌నకు అండగా నేషనల్ కన్వెషన్‌కు పంపారు. ఆమెకు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. భారత మూలాలున్న ఈ మహిళా నేతకు ట్రంప్ కార్యవర్గంలో కీలక పదవి దక్కే ఛాన్స్ ఉంది.