WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ యూజర్స్ కోసం మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా వాట్సప్‌లోనూ ‘మెన్షన్’ ఫీచర్‌ను జోడించాలని చూస్తున్న సంస్థ.. తాజాగా దాన్ని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్ చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులను ‘@’ సాయంతో ట్యాగ్ చేస్తుంటాం. అంటే ఆ వ్యక్తికి మనం స్టోరీ పెట్టినట్లు నోటిఫికేషన్ అందుతుంది. అలా వాళ్లు మన స్టోరీని చూస్తారు. అచ్చం అలాంటి సదుపాయాన్నే వాట్సప్ జోడించింది. దీంతో ఇకపై వాట్సప్‌లో స్టేటస్ పెట్టే సమయంలో కాంటాక్ట్‌లో నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేయొచ్చు.
వెంటనే నోటిఫికేషన్
వాట్సాప్‌లో స్టేటస్ అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ అనే బార్ కుడివైపున @ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే మనకు వాట్సాప్‌లోని కాంటాక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. వెంటనే మీరు మీకు నచ్చిన వ్యక్తులను మెన్షన్ చేయవచ్చును.స్టేటస్ అప్డేట్‌లో మెన్షన్ చేసే వారికి దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. అయితే ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదు. వినియోగదారుల గోప్యతకు కూడా ఎలాంటి భంగం కలగకుండా ఈ ఫీచర్‌ను కొత్తగా రూపొందించింది.