తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్ప్రత్యేక కథనం

YS Jagan: చంద్రబాబు తప్పిదాలను డైవర్ట్‌ చేసేందుకే అక్రమ కేసులు.. మాజీ సీఎం జగన్ ఘాటు విమర్శలు!

కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్‌ జగన్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.
‘చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. బాబు తప్పిదాలను డైవర్ట్‌ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారు. సిట్టింగ్‌ సీఎంను టీడీపీ నేత దారుణంగా దూషించాడు. సీఎంగా నన్ను దూషించినా బాబులా కక్ష సాధింపునకు దిగలేదు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టాం. నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నాడా? సీసీ ఫుటేజ్‌లో ఎక్కడైనా నందిగం సురేష్‌ కనబడ్డాడా? చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్‌. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు. రెడ్‌బుక్‌ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే బాబు దృష్టి పెట్టాడు. ప్రజా సమస్యలపై దృష్టి లేదు.’ అంటూ మండిపడ్డారు.

Also Read: భారీ స్కాంకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం?

చంద్రబాబు తప్పిదం వల్లే విజయవాడు మునిగిపోయింది!

విజయవాడ ముంపునకు సీఎం చంద్రబాబే కారణమని వైఎస్ జగన్ విమర్శించారు. తుపాను వస్తుందని ముందే చెప్పినా బాబు పట్టించుకోలేదని, తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు పనికి 60 మందికిపైగా చనిపోయారని మండిపడ్డారు. 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా? అని ప్రశ్నించారు. సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నీర్వీర్యం చేశారన్నారు. ఇంటింటికి సేవలను నిలిపేశారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం లేదు. అమ్మఒడి పథకాన్ని గాలికొదిలేశారు. బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మందులు, నర్సుల కొరత ఉంది. మెడికల్‌ కాలేజీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button