తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

YS Jagan: తిరుమల లడ్డూ వివాదం.. నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో పరమ పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని కూటమి ప్రభుత్వం.. చంద్రబాబుకు పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలకు తెర లేపుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

హిందువుల మనోభావాలతో చెలగాటం!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఈ లేఖలో ఆరోపించారు. అంతేకాదు, అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్య ఘటనలపై దృష్టి సారించేందుకు ఈ లేఖ రాస్తున్నానని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, సమగ్రత, ప్రతిష్టకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వేంకటేశ్వరుడికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, ఈ అబద్ధం చాలా హాని కలిగిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే!

కొత్త ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న జగన్, ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా పెట్టలేకపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు సమర్థతపై ప్రజల్లో నమ్మకం పోయిందని జగన్ ధ్వజమెత్తారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. తిరుమల విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. 6 నెలలకు ఓసారి ఈ-టెండరింగ్ ద్వారానే నెయ్యి కొనుగోళ్లు జరుగుతాయని, నెయ్యి కొనుగోళ్లపై దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోందన్నారు. ప్రమాణాలకు తగ్గట్టు నెయ్యి లేకపోతే.. ట్యాంకర్లను వెనక్కి పంపడం గతంలో చాలాసార్లు జరిగిందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button