Asian Champions Trophy: జయహో.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత జట్టు
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు తన విశ్వరూపం చూపిస్తోంది. లీగ్ దశలో దూకుడుగా ఆడి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్‌లోనూ సత్తాచాటింది. హర్మన్‌ప్రీత్ సేన 4-1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ (13వ), హర్మన్‌ప్రీత్ (19వ, 45వ), జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ) స్కోర్ చేశారు. కొరియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ (33వ నిమిషం) సాధించాడు.
సెప్టెంబరు 17న జరగనున్న ఫైనల్‌లో చైనాతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. నాలుగు సార్లు విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌పరంగా చూస్తే ఫైనల్‌లో ఇండియానే ఫేవరేట్ అని చెప్పొచ్చు. టోర్నీలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌కు మరో సెమీస్‌లో చైనా షాక్ ఇచ్చింది. తొలుత మ్యాచ్ 1-1తో టై అయింది. దీంతో షూటౌట్ నిర్వహించారు. ఇందులో చైనా 2-0తో పాక్‌ను ఓడించింది. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న చైనా ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి.