AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే (నాలుగో) టెస్టులో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. 340 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో 184 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్‌లో ఓపెనర్ జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మినహా అందరూ సింగిల్ డిజట్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 3, స్కాట్ బోలాండ్ 3, నాథన్ లైయన్ 2.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు.. భారత్ 369 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే కేవలం ఒకే ఒక దారి ఉంది. సిడ్నీ వేదికగా జనవరి 3 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అప్పడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 2-2తో సమం అవుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-0తో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉన్న ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుంటే అది జరగడం కాస్త కష్టమే. దీంతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్లే.