తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Bharath Vs Bangladesh: భారత్ – బంగ్లా టెస్ట్ మ్యాచ్ కు వరుణుడు చెక్.. ముగిసిన తొలి రోజు ఆట!

యూపీలోని కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్ – బంగ్లాదేశ్‌ రెండో టెస్ట్ మ్యాచ్‌కు అందరూ అనుకున్నట్లుగానే వరుణుడు తొలిరోజు తీవ్ర అంతరాయం కలిగించాడు. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. లంచ్‌ విరామం తర్వాత కొంతసేపు మ్యాచ్‌ జరగ్గా.. మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. మొదటి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ప్రస్తుతం బంగ్లా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులుగా ఉంది.

ఉదయం 10.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

కాన్పూర్‌లో నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9 గంటలకు వేయాల్సిన టాస్‌ను 10గంటలకు వేశారు. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైంది. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా జట్టును యువ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ బోల్తా కొట్టించాడు. ఓపెనర్లు షద్మాన్‌ ఇస్లామ్‌ (24), జకీర్ హసన్ (0)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ శాంటో, మొమినల్‌ హక్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. లంచ్‌ విరామానికి బంగ్లా స్కోరు 74/2గా ఉంది.

ఆలస్యంగానే రెండో సెషన్!

ఆటగాళ్లు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లే సమయంలో మళ్లీ చినుకులు ప్రారంభమయ్యాయి. దీంతో పిచ్‌తోపాటు మైదానాన్ని గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పేశారు. వర్షం ఆగిపోవడంతో 15 నిమిషాలు ఆలస్యంగా రెండో సెషన్‌ ప్రారంభమైంది. 29వ ఓవర్‌లో అశ్విన్‌ బౌలింగ్‌కు కెప్టెన్‌ శాంటో ఎల్బీగా దొరికిపోయాడు. గంట తర్వాత మళ్లీ వర్షం అందుకోవడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్‌ రహీమ్‌ (6), మొమినల్‌ హక్‌ (40) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌ ఒక వికెట్‌ తీశాడు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button