IND vs AUS: ఘోర ఓటమి.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానానికి భారత్!
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టి ప్రదర్శనతో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయింది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలోనే లక్ష్యా చేధించి సునాయస విజయాన్నందుకుంది. అంతకుముందు 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు కుప్పకూలింది.
మూడో స్థానానికి పడిపోయిన స్థానం!
దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత్ దిగజారింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న ఆసీస్ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లండ్ నిలిచాయి. అడిలైడ్ టెస్టు ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 61.11 శాతంతో తొలి స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్ల శాతం 57.59 శాతానికి తగ్గి.. మూడో ప్లేస్‌కు పడిపోయింది. 57.69 శాతం నుంచి 60.71 శాతానికి పెరిగి ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది.